ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని.. పుట్టిన రోజునాడే భర్త ఆత్మహత్య

  • విజయనగరం జిల్లా సాలూరులో ఘటన
  • ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లారీ క్లీనర్
  • కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానన్న బాధ, రెండేళ్ల కుమార్తె ముద్దుమురిపెం తీర్చలేకపోతున్నానన్న ఆవేదన ఓ లారీ క్లీనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. విజయనగరం జిల్లా సాలూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక దాసరివీధిలో నివసించే కొట్నాన లక్ష్మణరావు (30) లారీ క్లీనర్. కొన్నాళ్ల క్రితం సరస్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల తాను పనిచేస్తున్న లారీకి కిరాయిలు సరిగా లభించకపోవడంతో, జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. పూటగడవడం ఇబ్బందిగా మారింది.

దీంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని, కుమార్తె కనీస అవసరాలు తీర్చలేకపోతున్నానని మనోవ్యధకు లోనయ్యాడు. గురువారం రాత్రి భార్య, కుమార్తెను తీసుకుని గ్రామంలో జరుగుతున్న సందెన్న ఉత్సవాలను చూసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ తర్వాత బళ్ల వేషాలు చూద్దాం రమ్మని భార్య బలవంతం చేసింది. తాను రానని పక్కింటి వారితో వెళ్లాలని చెప్పి వారిని పంపించాడు. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పుట్టిన రోజునాడే తనువు చాలించిన భర్తను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
viziangaram
salur
suicide
Crime News

More Telugu News